7, జూన్ 2011, మంగళవారం

నటరాజ రామకృష్ణ

శ్రద్ధాంజలి - నటరాజ రామకృష్ణ




తెలుగు 'నటరాజు' కన్నుమూత
పేరిణి శివతాండవం, ఆంధ్రనాట్యం రూపకర్త రామకృష్ణ మృతి
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
కళాదిగ్గజం నేలరాలింది... తెలుగువారి ప్రాచీన నాట్యకళారీతులకు తిరిగి జీవంపోసి... ఆరు దశాబ్దాలుగా దశదిశలా వ్యాపింపజేసిన భరత కళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్‌ నటరాజ రామకృష్ణ మంగళవారం ఉదయం మరణించారు. ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం వంటి నాట్య రీతులకు వూపిరిలూదిన ఆయన వయసు 88 సంవత్సరాలు. వేలాది మందికి శిక్షణనిచ్చిన ఈ నాట్యగురువు... ఐదారేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతనెల 26న పరిస్థితి విషమించడంతో శిష్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆయన కన్నుముశారు. భౌతికకాయాన్ని శిష్యగణం సందర్శనార్థం బేగంపేటలోని కళాకృష్ణ అనే శిష్యుని నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కళకే అంకితమైపోయిన రామకృష్ణ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. సోదరి, సోదరుడు చాన్నాళ్ల క్రితమే చనిపోయాగా శిష్యుల నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రఖ్యాత నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ మృతికి పలువురు నివాళులు అర్పించారు. ఆంధ్రనాట్యానికి, పేరిణి నృత్యానికి, కూడిపూడి సంప్రదాయరీతులకు రామకృష్ణ విశేష ప్రాచుర్యం కల్పించారని, ఆయన మృతి కళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నాట్యాన్నే జీవిత సర్వస్వంగా చేసుకొని ఆరు దశాబ్దాలుగా కళామతల్లికి విశేష సేవలందించిన కళాదిగ్గజం అని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. కళను, సునిశిత మేధస్సును రంగరించి ఆయన చేసే పేరిణి శివతాండవం నృత్యరూపకం అద్భుతమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. నటరాజ రామకృష్ణ అస్తమయం కళా ప్రపంచానికి తీరనిలోటని, తెలంగాణ నృత్య విశేషం 'పేరిణి'ని పునరుజ్జీవింపజేసిన మహానాట్యాచార్యుడు అంటూ తెరాస అధ్యక్షులు కేసీఆర్‌ తన సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు తారామతి బారాదరి వద్ద ప్రభుత్వ లాంఛనాలతో రామకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రమణమూర్తి తెలిపారు.

















ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..
చిన్ననాటే 'నటరాజు' బిరుదాంకితుడైన రామకృష్ణ పూర్వీకులది కోనసీమ ప్రాంతం. అప్పట్లో ఇండోనేషియాకు వలసపోయారు. 1923 మార్చి 21న బాలి ద్వీపంలో రాంమోహన్‌రావు, దమయంతి దంపతులకు రామకృష్ణ జన్మించారు. తల్లిది నల్గొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాక. రామకృష్ణ చిన్నతనంలోనే ఆమె మృతిచెందారు. తర్వాత ఆయన కుటుంబం ఇండోనేషియా నుంచి చెన్నైకి వచ్చేసింది. పదో ఏట నుంచే నాట్యంపై మక్కువ ఉండేది. గజ్జెలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎండిన తుమ్మకాయలను కాళ్లకు కట్టుకుని నాట్యం అభ్యసించేవారు. క్రమంగా సోదరుడి సాయంతో ప్రసిద్ధ కళాకారుల వద్ద నాట్యశాస్త్రాన్ని అభ్యసించారు. భరతనాట్యంతో ప్రారంభించి ఎన్నో నృత్యరీతులను నేర్చుకున్నారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఆయన ఆజన్మ బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. చెన్నై నుంచి ఆరు దశాబ్దాల క్రితం తెలుగుగడ్డపై అడుగుపెట్టారు. శ్రీకాళహస్తిలో ఎక్కువ కాలం నాట్యశిక్షణ పొందారు. పుట్టింది ఇండోనేషియాలో... పెరిగింది చెన్నైలో... చదువంతా నాగపూర్‌లో... కాని ఆయన జీవితమంతా తెలుగుకళకే అంకితం చేయడం విశేషం. నాట్యరీతులకు పునరుజ్జీవనం
*స్వయంగా నాటకాలు రచించి ప్రదర్శిస్తూ, ఎంతోమంది కళాకారులకు శిక్షణనిస్తూ గడిపేవారు రామకృష్ణ. ఆయన సృష్టించిన అద్భుతమైన నాట్య ప్రక్రియల్లో 'నవ జనార్దన పారిజాతం' విశేష జనాదరణ పొందింది.
*దేవదాసీ చట్టం అమల్లోకి రావడంతో దేవదాసీలు కనుమరుగయ్యారు. ఆ నృత్యరీతులు కూడా తెరమరుగయ్యాయి. అలాంటి సమయంలో అద్భుతమైన ఆ నాట్య ప్రక్రియకు తిరిగి జీవం పోయాలనే సంకల్పంతో నటరాజ రామకృష్ణ ఊరూరా తిరిగి నృత్య కళాకారిణులను సంఘటితపరచి, సంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేసి 'ఆంధ్రనాట్యం' పేరిట దానిని తిరిగి తెలుగునాట సుస్థిరం చేశారు.
*700 ఏళ్ల క్రితం మరుగున పడిన కాకతీయుల కాలం నాటి 'పేరిణి శివ తాండవం' నృత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఏ ప్రభుత్వమూ, పాలకులూ, అకాడమీలూ, విశ్వవిద్యాలయాలూ చేయని పనిని రామకృష్ణ చేసి చూపించారు. పురుషులు మాత్రమే చేసే ఈ నృత్యాన్ని నృత్యరత్నావళి గ్రంథం ద్వారా తెలుసుకుని విశేష ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఆయన చేసిన ఓ అద్భుతం. ఆ స్ఫూర్తితోనే తర్వాత అనేక వందలమంది మగపిల్లలు గజ్జెకట్టి రంగస్థలంపైకి చేరారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడాయన శిష్యులు, ప్రశిష్యులు దేశవిదేశాల్లో వేలాదిగా ఉన్నారు.
*నాట్య కళారీతులపై వందలాది వ్యాసాలతోపాటు నలభైకి పైగా గ్రంథాలను, ఒక పరిశోధనాత్మక గ్రంధాన్ని ఆయన రచించారు.
పద్దెనిమిదో ఏటనే నటరాజు...
*మహారాష్ట్రలోని బందార సంస్థానం రాజాగణపతి పాండ్య 18వ ఏటనే రామకృష్ణను 'నటరాజ' బిరుదుతో సత్కరించారు. అప్పటినుంచి అది ఆయన సార్థకనామధేయమైంది.
*1968లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 'భరత కళాప్రపూర్ణ బిరుదు'తో గౌరవించింది.
*1980లో శ్రీశైల దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఏడాది ఆస్థాన నాట్యాచార్యునిగా నియమించింది.
*కళాప్రపూర్ణ, కళాసరస్వతి, రాజ్యలక్ష్మి అవార్డులు అందుకున్నారు.
*1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ 'దక్షిణ భారత ఉత్తమ నాట్యాచార్యుడు' బిరుదుతో సత్కరించింది.
*వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
*కేంద్ర ప్రభుత్వం 1992లో 'పద్మశ్రీ'తో గౌరవించింది.



















నివాళి
నృత్య తపస్వి
- జి.ఎల్.ఎన్.మూర్తి

నాట్యకళని నిక్కచ్చిగా నమ్మటం తప్ప అమ్ముకోవటం తప్పంటూ ఆచరించి చూపించిన ఆదర్శ కళాకారుడు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. 80 ఏళ్ళ వయసులో ప్రభుత్వ ఆసరా, వైద్య ఖర్చుల కోసం కళా కుటుంబం తపన తప్ప రక్తసంబంధీకులు లేని ఆయన అందరి మధ్య ఒంటరిగా నృత్య తపస్విగా చిరంజీవి అయ్యారు. ఇండోనేసియాలోని బాలీ ద్వీపంలో పుట్టి ఊహ తెలిసిన నాటి నుంచి ఆఖరి ఊపిరిదాకా నృత్య కళ తప్ప మరింకేమీ పట్టని ఆయన బతుకంతా కళాయానమే. శ్రీలంకతో మొదలెట్టి తూర్పు తీర ప్రాంతాల్లోని అన్ని కళారూపాల్నీ ఔపోసన పట్టి భావితరాలకు మహత్తర వారసత్వాన్ని అందించారు. యాభైకి పైగా పుస్తకాలు రచించారు. ఆయన కృషిపై 25 దాకా సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. ఆయన శిష్యగణం నేలకు నలు చెరుగులా విస్తరించారు.

హైదరాబాద్ ఆవిర్భావం ముందు, తర్వాత దక్కన్ పీఠభూమిలోని కళారూపాలపై ఆయన చేసిన అ«ధ్యయనం ఎన్నెన్నో కొత్త విషయాల్ని తడిమి తెచ్చింది. గోల్కొండ ప్రభువు మహమ్మద్ అబుల్ కుతుబ్‌షా ఆదరించి ప్రోత్సహించిన తారామతి, ప్రేమావతిల నాట్యం, సంగీతంపై ఆయన చేసిన అధ్యయనం, రాసిన పుస్తకాలు, ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రాలు, ప్రతిపాదనలు మనకు తెలియని మహత్తర కళాప్రస్థానాన్ని కళ్ళముందు కదలాడిస్తాయి.

కాస్తంత కళాభిమానం ఉందనిపిస్తే చాలు పెద్ద ఆశతో చేత చిన్న కాగితంతో కలిసి ఆ్రర్దంగా పెద్దలతో ఆయన చెప్పిన సంగతులు, చేయాల్సిందే అంటూ హితవు పలకటం ఆయన్ని ఎరిగిన వారందరికీ కన్నీళ్ళు తెప్పించే అంశం. తారామతి-బారాదరిని సర్వహంగులతో కళాకేంద్రంగా తీర్చిదిద్దటంతోపాటు ఒక పున్నమిరాత్రి వందలాదిమంది నర్తకులతో మహా ప్రదర్శన నిర్వహించాలన్న ఆయన కళాస్వప్నం, సన్నిహితులతో చెప్పిన ముచ్చట్లు ఆయన లేని వెలితికి మిగిలినవాళ్ళు చేయాల్సిన నివాళిగా మిగిలిపోయింది.

గత కొన్నేళ్ళుగా చక్రాల కుర్చీకి పరిమితమైపోయిన ఆయన ఇటీవల వరంగల్‌లో జరిగిన పేరిణి ఉత్సవాలలో ఔత్సాహిక నర్తకులు, కళాభిమానులు చేస్తున్న కార్యక్రమాలతో ఉత్తేజితుడై లేచి నర్తించిన సన్నివేశం ఒక నమ్మలేని నిజం. వెయ్యేళ్ళ నాటి కాకతీయ పాలనలో వెల్లివిరిసిన, పురుషులకు మాత్రమే పరిమితమైన తాండవ నృత్యంలోని విశేషాల్ని, రామప్పగుడిలోని శిల్పాలలోని కథల్ని గుదిగుచ్చి పేరిణిగా రూపకల్పన చేసి ఈ తరానికి అందించిన తపన ఆయన కృషిలో మహత్తర అధ్యాయం.

గోదావరి తీర ప్రాంతాల్లోని ఆలయ సంప్రదాయాల్లోని దేవదాసీలు చేసిన కళా ప్రదర్శనలు అన్నింటినీ వారి ఇళ్ళలో నెలల తరబడి గడిపి అధ్యయనంతో రూపొందించి ఆంధ్ర నాట్యం పేరుతో సృష్టించిన ఆయన కళాకేళి ఎప్పటికీ కోట్లాదిమంది కళాభిమానుల మనసులలో ముద్ర వేసుకుంటుంది. మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ వంటి వారి నుంచి ఆయన ఒడిసిపట్టుకున్న కళా సంప్రదాయాల్లోని సంగతుల్ని ఈ తరం శిష్యగణం పుణికిపుచ్చుకునేలా చేయటంలో అహోరాత్రులూ శ్రమించారు.

అన్నాబత్తుల సత్యభామ వంటి ఉద్దండ నర్తకీమణులకు హైదరాబాద్‌లోని తన గృహంలో ఆశ్రయమిచ్చి సేకరించిన అపురూప సమాచారం ఎంతో వెలుగుచూడాల్సిన అవసరం మిగిలే ఉంది. యాభయ్యో దశకంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని శాస్త్రీయం కాదు అది మామూలు జానపద కళే అంటూ చులకనగా కొట్టిపడేసిన ఢిల్లీ కళారంగ పెద్దలకు సవాలుగా హైదరాబాద్‌లో, ఆంధ్ర ప్రాంతంలో ఆయన ఉద్యమంగా చేపట్టి, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించి శాస్త్రీయ ప్రాభవాన్ని వెలికితెచ్చారు.

శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, కుమార సంభవం, మేఘసందేశం వంటి నృత్య రూపకాల్ని ఆయన రూపొందించి, ప్రదర్శించినవి ఈ తరం అగ్రశ్రేణి కళాకారులకు కూడా తెలిసీ తెలియనివే అయ్యాయి. నవ జనార్ధన పారిజాతం అంటూ తొమ్మిది రాత్రులు ఏకబిగిన తొమ్మిదిమంది అభినయ నర్తకులు, తొమ్మిదిమంది భామలు, తొమ్మిది వాయిద్యాలతో రూపొందించిన కళారూపం ఆయన దత్తతతో ఆకళింపు చేసుకున్న కళాకృష్ణ వంటి వారితో ఇప్పడు మిగిలి వుంది. తెలంగాణ పల్లె ప్రాంతాల్లో నృత్యంపై ఆసక్తి ఉన్న యువతరాన్ని ఆదరించి, అన్ని వసతులూ కల్పించి నేర్పించిన కళారూపాలు ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో కొత్తతరం విద్యార్థి కళాకారుల్లో అధ్యయనాంశాలుగా కొనసాగుతున్నాయి.

1975 ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా గల నృత్య కళాకారులందర్నీ ఆహ్వానించి నిర్వహించిన ప్రదర్శన రీతుల సదస్సు ఈ తరం వారికి తెలియని డాక్యుమెంటుగా ఉండిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట, కడియం, ధవళేశ్వరం, కపిలేశ్వరపురం, ఆలమూరు, జొన్నాడ, మడికి, కోరుమిల్లి, కోటిపల్లి, పిఠాపురంలోని కుంతిమాధవ వంటి ఆలయాల్లో వందలాది కళావంతుల నృత్య సంగీత ప్రదర్శనల్లోని అంశాలను ఆయన అపురూపమైన కళాకృతులుగా తర్వాతి తరాలకు అందించడంలో వారధి అయ్యారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడిగా నటరాజ రామకృష్ణ తెలుగు ప్రాంతంలోని సమస్త కళారూపాల్ని, జానపద అంశాలన్నింటినీ మళ్ళీ వికసించడానికి పునాది వేశారు. ఆధ్యాత్మ రామాయణంలోని అంశాలన్నింటినీ నర్తన రూపంలోకి తేవడంలో ఆయన మలచిన బాణి కొత్తతరానికి పూర్తిగా పట్టుబడని అధ్యయనాంశం అయింది.

తనకంటూ పెద్దగా ఆస్తిపాస్తులు పెంచుకోవటంలో ఏమాత్రం ఆసక్తి లేని రామకృష్ణ తనకు సంక్రమించిన ఆపారమైన విలువగల కానుకలు, వస్తువులు, జ్ఞాపికలను ఒక మ్యూజియంగా రూపొందించాలని కోరికతో వాటిని సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించారు. స్వర్ణ కిరీటం, అచ్చంగా రత్నాలు పొదిగిన శాలువాలు వంటివి ఎన్నెన్నో ఆ యూనివర్సిటీలో వెలుగు చూడకుండా మిగిలిపోయి ఉన్నాయి. వయసు పైబడుతున్నప్పుడు పెరిగే అనారోగ్యంతో శక్తి ఉడిగినా తనకు తారసపడ్డ కళాకారులందరితో చెప్పిన ముచ్చట్లు ఇంకా ఇంకా గ్రంథస్తం కావలసిన నాట్య విద్యగా ఉన్నాయని అభిమానులు అంటూ ఉంటారు. తాను ప్రాణంలేని కట్టెగా మిగిలినప్పుడు తన భౌతికకాయంపై తన పుస్తకాల్ని పేర్చి గులాబీ రేకులతో నింపి అమితంగా ఇష్టపడే తారామతి, ప్రేమావతి సమాధుల సరసన సమాధి చేయాలన్న ఆయన కళాత్మక కల సన్నిహితులకు మాత్రమే తెలిసిన కోరిక.

కూచిపూడి నృత్య సంప్రదాయానికి ప్రాణప్రదమైన భామాకలాపం, గొల్ల కలాపం, చోడిగాని కలాపం వంటి వాటిని ఈ తరం విద్యార్థులు, నర్తనతరం సరిగా అందిపుచ్చుకోవడం లేదని పలుమార్లు ఆవేదనతో చెపుతూనే ఉండేవారు. ఎన్నెన్నో రాత ప్రతుల్లో విభిన్నంగా ఉన్నవాటిని పరిష్కరించి ప్రామాణికంగా రూపొందించాలన్న రామకృష్ణ సూచనలు ఇంకా ఎక్కడా ఆచరణకు అందుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీలలో లలితకళ విభాగం ఏర్పాటులో చురుకైన పాత్రతోపాటు తొలితరం అధ్యాపకవర్గంలో ఉండి ఆయన చేసిన ప్రతిపాదనలు, సూచనలు ఇప్పటికీ అమలుకు నోచుకోకుండా మిగిలే ఉన్నాయి.

తెలుగు యూనివర్సిటీతో కలిసి కళారూపాల విషయంలో రామకృష్ణ అనేక ప్రయత్నాలు చేశారు. ఆ కళారూపాలు వెలుగు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయన శిష్యగణంపై ఉంది. 70 ఏళ్ళకు పైగా ప్రతీనిత్యం కళా ప్రదర్శనలు, కళాకారులతో సాన్నిహిత్యం తప్ప మరో జీవితం లేని నటరాజ రామకృష్ణ కన్న కలలు వాస్తవంలోకి తేవటం కోసం ప్రభుత్వపరంగా, విశ్వవిద్యాలయ స్థాయిలో అగ్రశ్రేణి కళాకారుల కర్తవ్యంలో భాగంగా మిగిలే ఉన్నాయి. ప్రముఖ సాంస్కృతిక సంస్థ కిన్నెర వంటివారు గత ఏడాదిన్నరగా నెలకు ఐదు వేల రూపాయలు ఆయనకు అందిస్తూ వస్తున్నారు. అవసాన దశలో నటరాజ రామకృష్ణకు ఆ డబ్బే ఆసరాగా నిలిచింది. ఆయన వ్యక్తిగత అవసరాల్ని, ఆర్థికపరమైన లేమిని ఐదేళ్ళ క్రితమే గుర్తించి ఆదుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు ఆదుకోలేకపోయారు.

జి.ఎల్.ఎన్.మూర్తి

నటరాజు ఇక లేరు

హైదరాబాద్, జూన్ 7 : ప్రముఖ నాట్యాచార్యులు, ఆం«ధ నాట్యానికి, పేరిణి శివ తాండవానికి ప్రాణం పోసిన నటరాజ రామకృష్ణ (88) మంగళవారం ఉదయం 7.15కు నిమ్స్‌లో కన్ను మూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు న్యుమోనియా రావడంతో గత నెల 27న నిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందారు. విషయం తెలిసి పలువురు శిష్యులు, ప్రముఖులు మంగళవారం ఉదయం నిమ్స్‌కు వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో రామకృష్ణ మృతదేహాన్ని ఆయన ముఖ్య శిష్యుడు కళాకృష్ణతోపాటు శిష్యులు అమీర్‌పేట లీలానగర్‌లోని రాజేశ్వరి అపార్ట్‌మెంటులో ఆయన ఇంటికి తరలించారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జన్మించిన ఆయన జీవితమంతా కళాయానమే. ఆంధ్ర నాట్యం, పేరిణి శివతాండవాలకు రామకృష్ణ ప్రాణం పోశారు. ఆయన అసలు పేరు రామకృష్ణ మాత్రమే నటరాజ అనేది ఆయన బిరుదు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

దాదాపు 50 పైగా పుస్తకాలు రచించారు. ఆయన చేసిన కృషిపై 25 దాకా సిద్ధాంత వ్యాసాలు ఉన్నాయి. తారామతి-బారాదరి సర్వహంగులతో కళాకేంద్రంగా కళకళలాడడంలో ఆయన కృషి చాలా ఉంది. ప్రేమావతి నాట్యం, సంగీతంపై ఆయన చేసిన అధ్యయనం, రాసిన పుస్తకాలు, ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రాలు, ప్రతిపాదనలు అనేకం. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న ఆయన యోగక్షేమాలను శిష్యులే చూసుకున్నారు. అన్నీ తామై ఆయనకు సేవలు చేశారు. లీలానగర్‌లో ఆయన ముఖ్య శిష్యుడు కళాకృష్ణ తీసుకున్న ఫ్లాటులోనే రామకృష్ణతో పాటు ఆయన సోదరి మంగతాయారు, ఆమె కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.

నటరాజ రామకృష్ణ అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. అందుకోసం తారామతి-బారాదరి వద్ద పురావస్తు శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.

ప్రముఖుల సంతాపం నటరాజ రామకృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. నటరాజ రామకృష్ణ భౌతిక కాయాన్ని మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్‌తో పాటు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, ఆయన శిష్యులు ఆయనకు నివాళులు అర్పించారు. నాట్యాన్నే జీవితసర్వస్వం చేసుకుని ఆరు దశాబ్దాల పాటు దేశానికి విశేష సేవలందించిన కళా దిగ్గజం నటరాజ రామకృష్ణ అని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.జయప్రకాశ్‌నారాయణ పేర్కొన్నారు. రామకృష్ణ మృతి కళా ప్రపంచానికి తీరని లోటంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నివాళి అర్పించారు.

రామకృష్ణ అందరూ గర్వించదగ్గ నాట్య కళాకారుడని, ఆయన లేని లోటు ఎప్పటికీ తీరనిదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. 800 ఏళ్ళ నాటి కాకతీయుల నాట్యరీతిని అధ్యయనం చేసి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చిన మహా విద్వాంసుడు రామకృష్ణ అని గద్దర్ అన్నారు. తెలుగు నృత్యరీతులను అవపోసన పట్టిన తపస్వి రామకృష్ణ అని కవి, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు అన్నారు. యాభై ఏళ్లుగా భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలు, సంగీతానికి ఆయన సేవలు అమోఘమని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ చెన్నారెడ్డి అన్నారు

























నటరాజ రామకృష్ణ కన్నుమూత

హైదరాబాద్, జూన్ 7: ప్రముఖ నాట్యాచార్యుడు, సంగీతజ్ఞాని, పద్మశ్రీ కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ రాజధానిలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 12రోజుల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో నిమ్స్‌లో చేరిన రామకృష్ణ వారం రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. మంగళవారం ఉదయం 7.15కి కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని బేగంపేటలోని లీలానగర్ నివాసానికి తరలించారు. బుధవారం ఉదయం గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో సమాధి చేస్తారని రామకృష్ణ శిష్యులు చెప్పారు. 88ఏళ్ల రామకృష్ణ తుది శ్వాస విడిచే వరకూ నృత్యం కోసం, నాట్యరీతులను వెలికి తీసుకురావడానికే కృషి చేశారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమికి అధ్యక్షుడిగా సేవలు అందించిన రామకృష్ణ కళాకారుడిగా, గురువుగా, మేథావిగా, సంగీతజ్ఞానిగా పేరుపొందారు. ఏ ఇతర దేశీయ నృత్య రీతులకు తీసిపోని ఔన్నత్యం ఉన్న ఆంధ్ర నాట్యాన్ని పునరుజ్జీవింప చేయాలనేదే తన లక్ష్యమని ఎపుడూ చెప్పే రామకృష్ణ, కాకతీయుల కాలంలో కనుమరుగైన పేరిణి శివతాండవం నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు. ఏడు దశాబ్దాల పాటు రాష్ట్రంలో సంప్రదాయ నాట్యకళలైన కూచిపూడి, పేరిణి నృత్యాలకు విశేష సేవలు అందించారు. ఇండోనేషియా బాలి ద్వీపంలో మార్చి 21, 1923న జన్మించిన రామకృష్ణకు చిన్ననాటి నుంచే నాట్యంపట్ల ఆసక్తి పెంచుకుని మాతృదేశానికి తిరిగి వచ్చారు. బాల్యమంతా రామకృష్ణ మఠంలో గడిపారు. గాంధీ ఆశ్రమంలో ప్రభాకర్, ఆశాదేవిలతో కలిగిన పరిచయం ఆయన జీవన విధానానికి సోపానమైంది. నాట్యాభిలాషతో ఎందరో గురువులను కలుసుకుని, ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి దేశం గర్వించేలా ఆంధ్రుల సంప్రదాయ నృత్యకళకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు. శ్రీ వేంకటేశ్వర కళ్యాణం, కుమార సంభవం, మేఘసందేశం వంటి నాట్య ప్రదర్శనలు ఆయనకు ఎంతగానో పేరుతెచ్చిపెట్టాయి. దక్షిణాది నృత్యరీతులపై దాదాపు 47గ్రంథాలు రాశారు.
ప్రముఖుల సంతాపం
నటరాజ రామకృష్ణ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, సిపిఐ, సిపిఎం, బిజెపి రాష్ట్ర నేతలు డాక్టర్ నారాయణ, బివి రాఘవులు, జి కిషన్‌రెడ్డి, లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, పిఆర్పీ నేత చిరంజీవి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటరాజ రామకృష్ణ తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేశారని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ భూమయ్య, మాజీ వీసీ ఆవుల మంజులత, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు సి నారాయణ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. నగరంలోనే ఉన్న నటరాజ రామకృష్ణ సోదరీమణి, వారి కుటుంబీకులు లీలానగర్ చేరుకున్నారు. బెంగలూరు, నెల్లూరు సహా రాష్టవ్య్రాప్తంగా ఉన్న రామకృష్ణ శిష్యులు వందలాదిమంది రామకృష్ణ కడపటి చూపునకు హైద్రాబాద్ చేరుకున్నారు.
నాట్యానికి ‘నటరాజు’
Nataraja-Ramakrishnaహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: పేరిణి శివతాండవం.. కాకతీయుల కాలంలో సైన్యాన్ని యుద్ధానికి ప్రేరేపించ డానికి ప్రదర్శించే నృత్యం.11 నుంచి 13వ శతాబ్దం వరకు కొనసాగిన కాకతీయుల కాలంలోనే అంతమైన ఈ నృత్య రీతులను ఆధునిక ప్రపంచానికి పరిచయం చేశారు నటరాజ రామకృష్ణ. యుద్ధ ‘ప్రేరణ’ అనే పదమే కాలక్రమేణా ‘పేరిణి’గా రూపాంతరం చెందింది.అదొక్కటే కాదు..చరిత్ర పుటల్లో కలిసి పోయిన ‘నవ జనార్ధనం’ అనే ప్రబంధ (బాలే) నృత్యాన్నీ వెలుగులోకి తెచ్చిన ఘనత ఆయనదే. నాలుగు శతాబ్దాల కిందటే కాలగర్భంలో కలిసిపోయిన ఆలయాల్లో శాస్ర్తీయ నృత్య ప్రదర్శన (ఆలయ నర్తనం)లను వెలికి తీశారు. 18 ఏళ్ల వయస్సులోనే బందారా సంస్థానాధీశుడు రాజా గణపతి పాండ్య చేతుల మీదుగా అందుకున్న ‘నటరాజ’ బిరుదు ఆయనకు ఇంటిపేరుగా మారింది.

1923 ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో నటరాజ రామకృష్ణ జన్మించారు. తండ్రి రామ్మోహన్‌ రావు, తల్లి దమయంతి. తల్లి స్వగ్రామం నల్లగొండ జిల్లా కొలనుపాక. ఇండోనేషియాలో స్థిరపడిన కుటుంబం ఆయనది. భారతీ యత పట్ల ఆప్యాయతతో కొన్నేళ్ల తరువాత రామకృష్ణ కు టుంబం స్వదేశానికి తిరిగి వచ్చి, కోనసీమలో స్థిరపడింది.చిన్నప్పుడే విశాఖలో ఓ ఆలయంలో జరిగిన వివాహా నికి హాజరైన రామకృష్ణ, అక్కడ ప్రదర్శించిన శాస్ర్తీయ నృత్యం పట్ల ఆకర్షితులయ్యారు. శాస్ర్తీయ నృత్యాన్ని నేర్చు కోవాలనే తపనతో అప్పట్లో ఉద్దండులైన మీనాక్షి సుంద రం పిళ్లై, వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్ర్తి, నాయుడుపేట రాజమ్మ, పెండ్యాల సత్యమాంబల వద్ద శిష్యరికం చేశారు.ఆంధ్రులకు అత్యంత ఇష్టమైన కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.

చాలాకాలం పాటు ఆయన కూచిపూడి లోనే గడిపారు. శాస్ర్తీయ నృత్య రీతులపై పరిశోధనలు చేశారు. పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి దేవాల యంలో ప్రదర్శినలు ఇచ్చారు.అంతరించి పోయాయ నుకున్న ప్రాచీన నృత్య రీతులను వెలుగులోకి తెచ్చి, వాటిపై సాధన చేశారు. ‘ఆగమ నర్తనం’ ప్రదర్శించారు. ఆయన గురించి తెలుసుకున్న అప్పటి బందారా సంస్ధానాధిపతి రాజా గణపతి పాండ్య రామకృష్ణకు ‘నటరాజ’ బిరుదును ప్రదానం చేశారు. అదే ఆయనకు ఇంటిపేరుగా మారింది. అనంతరం ఆయన నాగ్‌పూర్‌ మహారాజ దర్బార్‌లో నాట్యాచార్యునిగా చేరారు. 1955లో అక్కడి నుంచి తిరిగి వచ్చి, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నృత్య నికేతన్‌ను స్థాపించారు. ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. స్వయంగా వేయికాళ్లమండ పంలో పేరిణి శివతాండవంపై నృత్యాన్ని ప్రదర్శించారు.

పేరిణి..ఆణిముత్యం
కాకతీయుల కాలంలోఅనే అంతరించిపోయిన పేరిణి శివతాండవం నృత్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఘటన అనన్య సామాన్యం. శివతాండవం మీద జయప సేనాపతి రాసిన ‘నృత్య రత్నావళి’ అనే గ్రంధాన్ని రామకృష్ణ ఔపోసన పట్టారు. అంతేకాదు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఆలయాలనూ సందర్శించారు.
ఆలయ ప్రాకారాల మీద చిత్రీకరించిన పేరిణి శివతాండవం నృత్య రీతులను క్షున్నంగా అధ్యయనం చేస్తూ, వాటికి అనుగుణంగా పేరిణి శివతాండవం నృత్యా న్ని సృష్టించారనే చెప్పొచ్చు. అందుకే..పేరిణి శివతాం డవం నృత్య భంగిమలు చాలామటుకు కాకతీయులు నిర్మించిన ఆలయ ప్రాకారాల మీద గల రీతులను గుర్తుకు తెస్తాయని అభిప్రాయం కళాకారుల్లో ఉంది.

అవార్డులకు చిరునామా
1968లో రాష్ట్ర నాటక అకాడమీ నటరాజ రామకృష్ణకు భరత కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. అది మొదలు..ఆయనకు పలు అవార్డులు లభించాయి. 1980లో శ్రీశైలం దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. 1984లో కేంద్ర నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. 1991లో రాజా-లక్ష్మి ఫౌండేషన్‌ విశిష్ఠ పురస్కారాన్ని అందజేసింది. కేంద్ర ప్రభుత్వం 1992లో ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’తో ఆయనను సత్కరించింది.ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ తెలుగు ఆత్మగౌరవ పురస్కారాన్ని అందజేసింది. అప్పటి సోవియట్‌ రష్యా, ఫ్రాన్స్‌లల్లో ఆయన నాట్య ప్రదర్శనలను ఇచ్చారు. నటరాజ రామకృష్ణ కోరిక మేర కు ప్రభుత్వం వరంగల్‌లో ‘పేరిణి నృత్య పీఠం’ను నెలకొల్పింది. హైదరాబాద్‌ ఇబ్రహీంబాగ్‌ సమీపంలోని తారామతి బారాదరిని తీర్చిదిద్దింది.

ఈనాడు, ఆంధ్రజ్యోతి,ఆంధ్రభూమి, సాక్షి , The Hindu పత్రికల సౌజన్యం...
వారికి ధన్యవాదాలు.
కె.కె.కె 

 Kuchipudi legend Nataraja Ramakrishna passes away
Suresh Krishnamoorthy
Padmashree Dr. Nataraja Ramakrishna during his 87 birthday celebrations at Ravindra Bharathi on March 21,2010. A file photo: Nagara Gopal.
The Hindu 
Padmashree Dr. Nataraja Ramakrishna during his 87 birthday celebrations at Ravindra Bharathi on March 21,2010. A file photo: Nagara Gopal.
‘Nataraja' Ramakrishna (88), the Kuchipudi legend known for his ‘Andhra Natyam' and ‘Perini Shivatandavam,' passed away on Tuesday morning at the Nizam's Institute of Medical Sciences (NIMS). He was a bachelor.
The dance maestro was admitted to the hospital for treatment of pneumonia and stroke about 10 days ago. He was on a ventilator since the past three days. The last rites will be performed on Wednesday morning by Kala Krishna, a dance teacher who was a favourite of his, under the aegis of the Andhra Pradesh Cultural Council. He will be buried on the land given to him by the government adjacent to the Taramati Baradari on the outskirts of the city.
Ramakrishna was born in Bali, Indonesia, where his parents Damayanti Devi, who hailed from Nalgonda, and Ramamohan Rao, from East Godavari, migrated. The family later returned to India and from his childhood, Ramakrishna was interested in classical dance forms. At the age of 18, he was given the title of ‘Nataraja' in Nagpur, which got added to his name Ramakrishna. His first dance teacher was Sukhdev Kartak in Nagpur.
Among the awards bestowed upon him were the Padma Shri in 1992, a doctorate from the Andhra University and a ‘Bharata Kala Prapoorna,' apart from the NTR State Award. He is most known for reviving the 700-year-old dance form ‘Perini Shivatandavam.' He served as Chairman of the Andhra Pradesh Sangeet Natak Akademi. 








(Kamalakaram- Nataraju...)



















































'నటరాజ'కు ఏదీ నీరాజనం?

మన సంస్కృతిని, కళావైభవాన్ని చాటిచె ప్పే ఆంధ్రనాట్యానికి కొత్తవన్నెలు అద్దుదామని, ప్రపంచం మొత్తానికి ఆ కాంతుల్ని పంచుదామని, భాగ్యనగరంలోని తారామతి బారాదరిని నాట్యనిలయంగా తీర్చిదిద్దుదామని కలలు కన్నారు నటరాజ రామకృష్ణ. ఆ కల తీరకుండానే ఆయన కన్ను మూశారు. ఆయనకు ఇష్టమైన తారామతి బారాదరిలో ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. అక్కడే ఆయన స్మారకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఆయన స్వప్నాల్ని సాకారం చేస్తామని సర్కారు ప్రకటించింది. అయితే ఆ వాగ్దానాలు అమలు చేసేదిశగా ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా పడకపోవటం అయన అభిమానుల్ని కలచివేస్తున్నది.

నాట్యం ఆయన శ్వాస
జైనుల ఆలయ సంప్రదాయ కేంద్రమైన జనగామ చేరువలోని కొలనుపాకలో జన్మించిన నటరాజ రామకృష్ణ ఉగ్గుపాల వయసు నుంచి తుది శ్వాస దాకా నాట్య వికాసం కోసం తపన పడ్డారు. నాట్యంపై ఆయన రాసిన 45 పుస్తకాల విశేషాలు విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠాలు అయ్యాయి. మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన రూపొందించి, చూపించిన ఆంధ్రనాట్యం 'పేరిణి'లు తెలుగువారి నృత్యరీతుల్ని మన నమ్మే ఆచార వ్యవహారాల్లో మనకు తెలియనివి ఎన్నెన్నో వివరించి చెప్పాయి. 

రాష్ట్ర నృత్య అకాడమీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ ఆస్థాన నాట్యాచార్యగా ఆయన చేసిన కృషి, సరికొత్త నాట్య బృందాలని, శిష్యగణాన్ని తయారుచేసింది. బౌద్ధం, వైష్ణవం, శైవ పద్ధతుల్లో నృత్యంలో వచ్చిన కొత్తకొత్త మార్పులను అందిపుచ్చుకుని నాట్యానికి మెరుగులు దిద్దేవారాయన. 2,200 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా కొనసాగుతున్న ఆలయ నృత్య సంప్రదాయానికి 1970 ఆగస్టు 22న ఆంధ్రనాట్యంగా పేరుపెట్టి ఆధునిక తరం ముందుకు తెచ్చారాయన. రంభ, ఊర్వశి, మేనకలు స్వర్గంలో ఈ నాట్యాన్నే నర్తిస్తారనే చందంగా తెలుగునేలకు అరుదైన నాట్యరీతుల్ని ఆయన అందించారు.

నాట్యానికి అనువైన సాహిత్యం, అందుకు తగిన వాయిద్యంతో తాళం, లయ ఏర్పాటు చేసుకుని జతి, గతి, యతి, జాతి వంటివాటితో నృత్యం చేయడం రంభ సంప్రదాయంగా నిగ్గు తేల్చారు. సాముగరిడీ, మోళీ, మొగ్గలు, తలపై కుండలు, కాళ్ళకింద పదునైన అంచుల పళ్ళెం, చేతుల్లో ప్రమిదల దీపాలు, ఒత్తులు వంటి వాటితో నృత్యం చేయడం మేనక తీరుగా నిర్వచించారు. మంచి కవి పండితులు రాసిచ్చిన పదం, శ్లోకాలను తీరుబాటుగా కూర్చుని హాయిగా ఆస్వాదించే అభినయాన్ని ఊర్వశి శైలిగా పేర్కొన్నారు. వాటన్నింటినీ పుణికిపుచ్చుకుని ఆలయాల్లో ప్రదర్శించే దేవదాసీల నాట్య పద్ధతుల్ని నటరాజ రామకృష్ణ వివరించారు.

నాట్య వేదిక కోసం ఆరాటం
తెలుగువిశ్వవిద్యాలయంతో నాట్యం బోధన కోసం ఆయన సిలబస్ రూపొందించారు. పి.ఎస్.ఆర్., ఉమా రామారావు, కళాకృష్ణల సాయంతో ఆయన రూపొందించిన సిలబస్ చదివి ఇప్పటికి మొత్తంగా 12 వందల మంది నాట్య శాస్త్రంలో నిష్ణాతులయ్యారు. నిజామాబాద్, ఆర్మూరు, వరంగల్‌లోని రుద్రమపీఠం, కపిలేశ్వరపురం, రాజమండ్రి, కాకినాడ, అమెరికాలో ప్రత్యేకంగా ఆంధ్రనాట్యం పేరిణీల కోసం శిక్షణాసంస్థలను నటరాజ రామకృష్ణ శిష్యులు నెలకొల్పారు. తెలుగువారితోపాటు ఇతర దేశాలు, భాషల వారు అందులో నాట్యవిద్యలో శిక్షణ పొందుతున్నారు. ఎవరి ధోరణిలో వారు ఇస్తున్న శిక్షణలో తప్పటడుగులు పడటాన్ని ఆయన గమనించారు. అన్ని ప్రక్రియలను సమన్వయం చేసి గోల్కొండ డక్కన్ నాట్యరీతుల రాణి తారామతి - ప్రేమావతి మహల్‌ను నాట్యకేంద్రంగా ఏర్పాటు చేయాలని తలపోశారు. తన ఆలోచనలన్నీ కలబోసి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు.

అప్పటి పర్యాటక శాఖ సారథి సి.ఆంజనేయరెడ్డి ఆ నివేదికను పరిశీలించి, స్పందించారు. ఫలితంగా అత్యాధునిక తారామతి - బారాదరి రూపుదిద్దుకుంది. దాదాపుగా 20 కోట్ల రూపాయలు వెచ్చించి రూపొందించిన తారామతి - బారాదరి అసలు లక్ష్యం ఆ తరువాత రోజుల్లో అడుగంటి పోయింది. అరుదైన నాట్యవేదికను ఏర్పాటు చేద్దాం అని తలపోస్తే ఆ స్థానంలో పర్యాటక కేంద్రం ఏర్పాటు కావటంతో నటరాజ రామకృష్ణ తల్లడిల్లిపోయారు. ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కన్నీళ్లకు కొందరు చలించగా, మరికొందరు పెద్దలు వాటిని సొమ్ము చేసుకున్నారు. వరంగల్‌లో పెద్ద ఎత్తున జరిగిన ఆంధ్రనాట్యం, పేరిణి ఉత్సవాలను 2007లో లక్షలమంది కళ్లారా చూసి పులకించి పోయారు. అప్పుడు కోరిన జాగా, వసతి వంటి వాటికి ప్రభుత్వం స్పందించింది. 

వారిచ్చిన వాటిని అందిపుచ్చుకోలేక తెలుగు యూనివర్సిటీ చేతులెత్తేసింది. కళాకారులు మొత్తుకున్నా అధికారులు నిశ్చింతగా తమతమ పనుల్ని చక్కబెట్టుకున్నారు. కొలునుపాక జైనమందిరంలోని నృత్య చిత్రాలు, జాయప సేనాని పేర్కొన్న అత్తిలి చల్లవ్వ, సమస్త వేదాలు వికసించిన ముంగండ అగ్రహారం, ఆ చెంతనే గల అనాతవరంలోని దేవదాసీలు, గోదావరి తీర ప్రాంతాలు గద్వాల, ఆలంపురం, ధర్మపురి, వేములవాడ, మహబూబ్‌నగర్ జిల్లా పాలెం, హైదరాబాద్ చేరువలోని వర్గల్ తదితర ప్రాంతాల్లో నర్తనం వృత్తిగా గల కళాకారులు, దేవదాసీల బాగోగులపై నటరాజ రామకృష్ణ పలు సూచనలు చేశారు. ఆయనతోనే ఆ సూచనలు గాలిలో కలిసిపోయాయి.

ఎన్నో హామీలు.. అన్నీ గాలికే!
తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సమస్తం నాట్య కులం కోసం ధారపోశారు నటరాజ రామకృష్ణ. ఆచరణ సవ్యంగా లేని తెలుగు యూనివర్సిటీ నుంచి నటరాజ రామకృష్ణ సెంట్రల్ యూనివర్సిటీ వైపు ఆశలు మళ్లించారు. తనకు ఉన్న సమస్తం ఆ యూనివర్శిటీ పరం చేశారు. అపురూపమైన రత్నఖచిత కిరీటం, స్వర్ణకమలం, మంచి రత్నాలు పొదిగిన కాశ్మీర్ శాలువా, ముత్యాలు, బంగారు హంస, పతకాలు, మరెన్నో షీల్డులు, పురస్కారాలన్నింటినీ సెంట్రల్ యూనివర్శిటీకి అందించారు. హైదరాబాద్ నగర నడబొడ్డున గల గోల్డెన్ థ్రెషోల్డ్‌లో పర్యాటకులను, కళాప్రేమికులను ఆకర్షించి మెప్పించేలా మ్యూజియంగా ఏర్పాటు చేస్తామని సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించింది.

యేటా నటరాజ రామకృష్ణ పేరిట నాట్య రంగ ప్రముఖులతో ప్రత్యేక ప్రసంగాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. రెండేళ్ల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో నటరాజ రామకృష్ణ స్వయంగా హాజరై తెగ సంతోష పడిపోయారు. అనారోగ్యం, వృద్ధాప్యం ఇబ్బంది పెడుతున్నా కళపట్ల ఆపేక్షతో కలసి వస్తారనుకున్న వారినందరినీ పేరుపేరునా పలకరించి మనసు మాటల్ని చెప్పేవారు. ఈ ఏడాది జూన్8న ఆయన జీవితం ముగిసిపోవడంతో శిష్యులు, అభిమానులు పెద్దదిక్కు లేనివారయ్యారు. తారామతి - బారాదరిలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ పెద్దలు పలు హామీలు కురిపించారు.

ప్రభుత్వ పరంగా నటరాజ రామకృష్ణ స్మారక చిహ్నంతోపాటు తెలుగు నాట్యరీతుల అధ్యయన కేంద్రం, పీఠం వంటిది నెలకొల్పుదామన్నారు. నేటికీ ఆ ప్రయత్నమే మొదలు కాలేదు. నటరాజ రామకృష్ణ సొంత పుస్తకాలతో మినీ డ్యాన్స్ లైబ్రరీ ఏర్పాటు చేయాలనే సంకల్పం కూడా ఆచరణకు నోచుకోలేదు. ఈలోగా ఆ గ్రంధాలు చెల్లాచెదురయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నెలకొల్పిన గ్రంథాలయం ఉనికిలో వున్నా వారికి ఆ పుస్తకాలు ఉచితంగా సేకరించవచ్చన్న స్పృహ లేకుండా పోయింది. రామకృష్ణ రాసిన పుస్తకాలన్నింటినీ చదువుదామనుకున్నా, కొనుక్కుందామనుకున్నా ఒక్కసెట్టు కూడా అందుబాటులో లేకుండా పోయింది.

ఆ కలలు సాకారం కావాలి
ఈ పరిస్థితుల మధ్య నేటి (నవంబర్ 3) మధ్యాహ్నం సెంట్రల్ యూనివర్సిటీలో నటరాజ రామకృష్ణ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లీలా శాంసన్ సినిమా, నృత్య రంగాల్లోని నాయిక తీరుతెన్నులపై అధ్యయన ప్రసంగం చేస్తారు.

నటరాజ రామకృష్ణ తొలి సంస్మరణ కార్యక్రమంలో మాటలతో పాటు చేతల నివాళి కూడా ఉండాలని కళాభిమానుల కాంక్ష. కూడకట్టే వారుంటే ఆ మహనీయుని కలలను సాకారం చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడకట్టి, ప్రభుత్వం తగురీతిలో స్పందిస్తే సకల హంగుల సమన్వయ కేంద్రం సత్వరం రూపుదిద్దుకుంటుంది
(Andhra jyothi - 3/11/2011)